కాలంతో పోటీ… మాకు మేమే సాటి !!
గిరా గిరా వేగిరంగా
బిరా బిరా బొంగరంలా
చకా చకా చక్రంలా
కాలంతో పోటీ!!
నిముషమైనా వేచి ఉండం!!
ఆలస్యం అమృతం విషం అన్నారుగా!!
చేసే పాటు ఏదైనా…విడవం తొందరపాటు!!
చేసే పాటు ఏదీ లేకపోయినా… చిందరవందరే మా అలవాటు!!
మాదో నవ తరం…అడావుడి అనవరతం!!
మాదో కలవరం…కదా అదో అనవసరం!!
కాలంతో పోటీ…మాకు మేమే సాటి !!
సాటి మనుషులంటే…మాకు పట్టదు ఏ పాటి!!
ఆత్రం అవశ్యం… వంటి పైన వస్త్రం అలక్ష్యం!!
ఆదమరచి అన్నీ మరచి…
ముంచుకొచ్చినట్లు బండెక్కి…
ఆదరా బాదరాగా కొట్టుకి తోలుకొచ్చి…
అంగట్లో అంగన ముంగిట్లో…
కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చి…
అర్ధనగ్న విన్యాసం అబ్బాయిది!!
అర్థరహిత మందహాసం అమ్మాయిది!!
ఎందుకంత తత్తర పాటో…?
తెలియని మనకో…గ్రహపాటు!!
మరెన్నో చూడాలిక… కాలంతో పాటు!!
అకటా…మనమంతా వంత పాడాలట!!
ఈ దురలవాటు విశ్వవ్యాప్తమట!!
డా. పొట్లూరి రవి కిరణ్
పోరంకి, కృష్ణా జిల్లా
ఫోన్: 9440440450