ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పెండింగ్ పదవుల నియామకం పైన కసరత్తు చేస్తోంది. టీటీడీ తో సహా అన్ని కీలక పదవుల పైన చంద్రబాబు - పవన్ చర్చలు చేసారు. ప్రాధమికంగా కొన్ని పదవుల పైన నిర్ణయానికి వచ్చారు. టీటీడీ ఛైర్మన్ గా మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయుడు పేరు ఖరారు చేసినట్లు సమాచారం. అదే విధంగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తో పాటుగా చీఫ్ విప్...జనసేన, బీజేపీ విప్ ల నియామకం పైన తుది నిర్ణయం తీసుకున్నారు.
డిప్యూటీ స్పీకర్ గా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను ఖరారు చేసినట్లు సమాచారం. స్పీకర్ గా ఉత్తరాంధ్రకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉండటంతో…డిప్యూటీ స్పీకర్ గా రాయల సీమ ప్రాంతానికి చెందిన బీసీ నేత కాల్వ శ్రీనివాసుల వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, సవిత స్థానం దక్కించుకున్నారు. దీంతో, సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
చీఫ్ విప్ గా జీవీ
అసెంబ్లీలో కూటమికి 164 సభ్యుల సంఖ్యా బలం ఉంది. అదే విధంగా టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో చీఫ్ విప్ పదవి ఆ పార్టీకే దక్కనుంది. ఈ పదవి తొలి నుంచి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఇస్తారనే ప్రచారం సాగింది. అయితే, పల్నాడు జిల్లా నుంచి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేకపోవటంతో ఆ ప్రాంతానికి చెందిన వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను చీఫ్ విప్ గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే విధంగా మూడు పార్టీల నుంచి 14 మంది విప్ లను నియమించనున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల నుంచి
జనసేన నుంచి ఇప్పటికే నలుగురి పేర్లను పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు సిఫార్సు చేసారు. పార్టీ ఫ్లోర్ లీడర్ గా నాదెండ్ల మనోహర్, జనసేన చీఫ్ విప్ గా లోకం మాధవిని నియమించనున్నారు. అదే విధంగా జనసేన నుంచి మరో ఇద్దరు విప్ లుగా నియమితులు కానున్నారు. బీజేపీ నుంచి చీఫ్ విప్ గా సుజనా చౌదరి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ఫ్లోర్ లీడర్ గా విష్ణు కుమార్ రాజు నియమితులయ్యారు. అదే విధంగా టీటీడీ బోర్డుతో పాటుగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల పైన ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.