ఏపీలో నామినేటెడ్ పదవుల కోసం మూడు పార్టీల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు పార్టీల నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా.. ఇప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. రేపోమాపో అంటూ సాగదీయటంతో కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో, నామినేటెడ్ పదవుల భర్తీ పైన చంద్రబాబు, పవన్ ఒక ఫార్ములా సిద్దం చేసారు. పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశం పై నిర్ణయానికి వచ్చారు.

ఆశావాహుల నిరీక్షణ టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, పార్టీ నేతలు నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ కార్యక్రమంలో నామినేటెడ్‌ ఆశావహుల దరఖాస్తులే ఎక్కువగా ఉంటున్నాయనే చర్చ టిడిపిలో జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావేదిక పేరుతో ఈ గ్రీవెన్స్‌ కార్యక్రమం మొదలుపెట్టారు. సమస్యలు చెప్పుకునేందుకు ఎంతమంది వస్తున్నారో అంతే సంఖ్యలో పదవుల కోసమూ వస్తున్నారు.
చంద్రబాబు కసరత్తు నామినేటెడ్‌ పోస్టుల కోసం చూస్తున్న ఆశావహులు తమ బయోడేటాను పార్టీ కార్యాలయంలోని ప్రోగ్రామ్స్‌ కమిటీకి అందించాలని టిడిపి అధిష్టానం నెలన్నర క్రితం ఆ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రోగ్రామ్స్‌ కమిటీ నాయకుల నుంచి బయోడేటా, దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రోగ్రామ్స్‌ కమిటీకి వచ్చిన బయోడేటాల పరిశీలన కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. టిడిపిలో సీనియర్‌ నేతలు సైతం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులను ఆశిస్తున్నారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా టికెట్లు త్యాగం చేసిన నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కోసం సీటు త్యాగం చేసిన నేతలు ఈ విభాగంలో ఉన్నారు.

పంపకాల ఫార్ములా టిడిపి కూటమిలో నామినేటెడ్‌ పదవుల పంపకాలకు ఒక ఫార్ములా సిద్దం చేసారు. టిడిపి గెలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, బిజెపికి 10 శాతం చొప్పున పదవులు పంపకాలు చేయాలని మూడు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో జనసేనకు 60 శాతం, టిడిపికి 30 శాతం, బిజెపికి 10 శాతం చొప్పున, బిజెపి గెలిచిన నియోజకవర్గాల్లో బిజెపికి 60 శాతం, టిడిపికి 30 శాతం, జనసేనకు 10 శాతం పంపకాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో, పదవుల భర్తీ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది స్పష్టత రావాల్సి ఉంది.

0Shares