హైదరాబాద్, మే 21: కడప లోకసభ సభ్యుడు, వైయస్సార్  కాంగ్రెస్ అధ్యక్షుడు  వైయస్ జగన్మోహన్రెడ్డి  తనపై పడిన అక్రమాస్తుల కేసులో  సీబీఐ కోర్టు కు హాజరుకావడంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.   ఈ నెల 28న కోర్టుకు  తప్పకుండా వెళ్ళాల్సివస్తోంది. లేదంటే అరెస్టుకు సిద్దం కావాల్సిందే. 28న కోర్టుకు హాజరు కాని పక్షంలో అరెస్ట్ వారెంట్ విడుదవుతుందని కొందరు కొందరు న్యాయవాదులు సూచిస్తున్నారు. 

పైగా జగన్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. 28న  జగన్ తరపున న్యాయవాది మాత్రమే  హాజరు కావడం కుదరదని కోర్టు తేల్చిచెప్పింది. ఉపఎన్నికల నేపధ్యంలోవ్యక్తిగత కారణాల దృష్ట్యా  జగన్ హాజరు కాలేరని ఈ మేరకు మినహాయింపు ఇవ్వాలని కోరుకొంటున్నన్యాయవాదిని సీబీఐ న్యాయమూర్తి నిరాకరించారు.  ఈ నెల 28న విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరై తీరాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు పూర్తయ్యే వరకూ సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్ల విచారణ నిలిపివేయాలని కోరుతూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదప్రతివాదాలు జరిగాయి. సెక్షన్ 173 (8) ప్రకారం సీబీఐ ఎన్ని చార్జ్‌షీట్లయినా దాఖలు చేసుకునే అధికారం కలిగి ఉందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. హైకోర్టు మినహా మరే కోర్టుకీ సంబంధిత విచారణ నిలిపివేసే హక్కు లేదనీ గుర్తుచేశారు. దరిమిలా కేసు విచారణను 28వ తేదీకి వాయిదా వేశారు. మధ్యలో జగన్ వ్యక్తిగత హాజరుకి మినహాయింపు అవకాశంపై ప్రశ్నించిన విజయసాయిరెడ్డి తరపు లాయర్‌పై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పారు.

Share